Crispy Chicken Popcorn : చికెన్ తో మనం వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే చిరుతిళ్లల్లో చికెన్ పాప్ కార్న్ కూడా ఒకటి. చికెన్ పాప్ కార్న్ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. చాలా మందిదీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ చికెన్ పాప్ కార్న్ ను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా చికెన్ పాప్ కార్న్ ను తయారు చేసి తీసుకోవచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ చికెన్ పాప్ కార్న్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన బోన్ లెస్ చికెన్ క్యూబ్స్ – 500 గ్రా., చిల్లీ ప్లేక్స్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, వెనిగర్ – ఒక టీ స్పూన్, ఒరిగానో – ఒక టీ స్పూన్, లైట్ సోయా సాస్ – ఒక టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ – ఒక టీస్పూన్, కోడిగుడ్డు – 1, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, బ్రెడ్ క్రంబ్స్ – ఒక పెద్ద కప్పు, పాప్రికా – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో చికెన్ క్యూబ్స్ ను తీసుకోవాలి. తరువాత ఉప్పు, చిల్లీ ప్లేక్స్, వెనిగర్, ఒరిగానో, లైట్ సోయా సాస్, పెప్పర్ పౌడర్ వేసి కలపాలి. తరువాత సగం కోడిగుడ్డు, మైదాపిండి వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీటిని పోసి కలపాలి. తరువాత ఈ ముక్కలను 2 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. వీలైనంత వారు వీటిని రాత్రంతా కూడా ఫ్రిజ్ లో ఉంచి తయారు చేసుకోవచ్చు. 2 గంటల తరువాత ముక్కలను బయటకు తీసి ఉంచాలి. తరువాత ప్లేట్ లో బ్రెడ్ క్రంబ్స్ వేసుకోవాలి. తరువాత బ్రెడ్ క్రంబ్స్ లోనే పాప్రికా వేసి కలపాలి.
ఇది లేని వారుకొద్దిగా మామూలు కారాన్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలను బ్రెడ్ క్రంబ్స్ తో బాగా కోటింగ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక చికెన్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ తయారవుతుంది. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా ఇంట్లోనే చాలా సులభంగా చికెన్ పాప్ కార్న్ ను తయారు చేసి తీసుకోవచ్చు.