Crispy Rava Dosa : మనకు ఉదయం పూట హోటల్స్ లో, బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో రవ్వ దోశ కూడా ఒకటి. రవ్వ దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. అచ్చం బండ్ల మీద లభించే విధంగా రుచిగా, కరకరలాడుతూ ఉండే ఈ రవ్వ దోశను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఈ రవ్వ దోశను మనం తయారు చేసుకోవచ్చు. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా రవ్వ దోశను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు.. ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ రవ్వ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుల్లటి పెరుగు – పావు కప్పు, ఉప్పు – తగినంత, బొంబాయి రవ్వ – ఒక కప్పు, బియ్యం పిండి – ముప్పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – రెండు టీ స్పూన్లు, నీళ్లు – 4 కప్పులు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం తరుగు – ఒక టీ స్పూన్.

క్రిస్పీ రవ్వ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా చేసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, బొంబాయి రవ్వ వేసి కలపాలి. తరువాత మిరియాలను, జీలకర్రను బరకగా దంచి వేసుకోవాలి. తరువాత కరివేపాకు వేసి కలపాలి. ఇప్పుడు 2 కప్పుల నీళ్లు పోసి ముందుగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత మరో రెండు లేదా రెండున్నర కప్పుల నీళ్లు పోసి కలిపి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కొత్తిమీర వేసి కలిపి పక్కకు ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి.
పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయతో రుద్దుకోవాలి. తరువాత పెనం మీద ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిశ్రమాన్ని అక్కడక్కడ చల్లుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న దోశ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ దోశను నూనె వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత దీనిని మధ్యలోకి మడిచి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే రవ్వ దోశ తయారవుతుంది. దీనిని టమాట చట్నీ, పల్లీ టచ్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నోటి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు, అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు, సమయం తక్కువగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇలా రవ్వ దోశను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.