Dalcha : కందిపప్పుతో రకరకాల పప్పు వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కందిపప్పుతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ కందిపప్పుతో చేసుకోదగిన వంటకాల్లో దాల్చా కూడా ఒకటి. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. విందుల్లో ఎక్కువగా ఈ వంటకాన్ని వడిస్తూ ఉంటారు. ఈ దాల్చాను సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్చా తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – అర కప్పు, మైసూర్ పప్పు – అర కప్పు, నీళ్లు – 2 కప్పులు, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, నూనె – 5 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, పొడుగ్గా తరిగిన టమాటాలు – 2, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, సొరకాయ ముక్కలు – ఒక కప్పు, వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
దాల్చా తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పు, మైసూర్ పప్పు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లు పోసి పప్పును అరగంట పాటు నానబెట్టాలి. తరువాత ఇందులోనే పచ్చిమిర్చి, పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి పప్పును మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి పప్పును జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
తరువాత సొరకాయ ముక్కలను వేసి మూత పెట్టి మగ్గించాలి. సొరకాయ ముక్కలు మగ్గిన తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పప్పు, చింతపండు రసం వేసి కలపాలి. తరువాత రెండు గ్లాసులు లేదా తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని రెండు నుండి మూడు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దాల్చా తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.ఈ దాల్చాను శనగపప్పుతో కూడా తయారు చేసుకోవచ్చు.