Dhaba Style Butter Chicken : మనకు ధాబాలల్లో లభించే చికెన్ వెరైటీల్లో బటర్ చికెన్ కూడా ఒకటి. బటర్ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ధాబా స్టైల్ బటర్ చికెన్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా బటర్ చికెన్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ధాబా స్టైల్ బటర్ చికెన్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ బటర్ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బటర్ – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 2, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, నీళ్లు – ముప్పావు కప్పు, పంచదార – పావు టీ స్పూన్, కసూరిమెంతి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్.
మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు..
బటర్ – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – ఒక టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, తరిగిన టమాట – 1.
మ్యారినేట్ చేసుకోవడానికి గల పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – 300 నుండి 400 గ్రా., పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్.
ధాబా స్టైల్ బటర్ చికెన్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు వేసి బాగా కలపాలి. తరువాత దీనిని రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత దీనిని బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు అలాగే ఉంచాలి. తరువాత కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసి వేడి చేయాలి. తరువాత చికెన్ వేసి వేయించాలి. చికెన్ మెత్తగా ఉడికి పైన గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. చికెన్ ఇలా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కాల్చిన బొగ్గును తీసుకుని అందులో బటర్ వేసి కళాయి మధ్యలో ఉంచి మూత పెట్టాలి. దీనిని 2 నుండి 3 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత మూత తీసి చికెన్ ను వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి.
తరువాత మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి వేయించాలి. టమాట ముక్కలు మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి జార్ లోకి తీసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, కారం వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ఉప్పు వేసికలపాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిని దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత పంచదార, కసూరిమెంతి, కొత్తిమీర, ప్రెష్ క్రీమ్ వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బటర్ చికెన్ తయారవుతుంది. దీనిని రోటీ, నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బటర్ చికెన్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.