IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం విదితమే. అయితే ఈసారి రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జియాంట్స్ అనే రెండు కొత్త జట్లు చేరడంతో మొత్తం ఐపీఎల్ జట్ల సంఖ్య 10కి చేరింది. దీంతో 10 జట్లు ఐపీఎల్‌ను ఎలా ఆడుతాయి ? అనే సందేహం చాలా మందిలో నెలకొంది. ఈ క్రమంలోనే బీసీసీఐ ఈ విషయంపై స్పష్టతను ఇచ్చింది. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ క్రమలో గ్రూప్ ఎ, గ్రూప్ బి లలో 5 జట్ల చొప్పున మ్యాచ్‌లు ఆడనున్నాయి.

ఐపీఎల్‌లో విజయం సాధించిన జట్లు, ఫైనల్‌కు చేరిన జట్లు, ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లను వాటి మ్యాచ్ ల ఆధారంగా రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఈ క్రమంలోనే గ్రూప్ ఎ, గ్రూప్ బి లుగా మొత్తం 10 జట్లను విభజించారు. దీంతో ఒక్కో గ్రూప్‌లో 5 జట్లు ఉంటాయి. ఇక ఒక గ్రూప్‌లో ఉన్న ఒక్కో జట్టు మిగిలిన నాలుగు జట్లతో రెండు మ్యాచ్‌ల చొప్పున ఆడుతుంది. అలాగే ఒక గ్రూప్‌లో ఉన్న ఒక జట్టు పక్క గ్రూప్‌లో ఉన్న నాలుగు జట్లతో ఒక్క మ్యాచ్‌ను ఆడుతుంది. ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లను ఆడుతుంది. దీంతో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. తరువాత ప్లే ఆఫ్స్, ఫైనల్ నిర్వహిస్తారు. ఇలా ఈ సారి ఐపీఎల్ టోర్నీ జరగనుంది.
ఇక ఈసారి ఐపీఎల్‌ను కేవలం 4 వేదికల్లోనే నిర్వహిస్తారు. ముంబై, పూణెలలో లీగ్ మ్యాచ్‌లు, అహ్మదాబాద్ లో ప్లే ఆఫ్స్, ఫైనల్ జరుగుతాయి. దీంతో ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు ప్రేక్షకులను సగం కెపాసిటీ మేర అనుమతించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.