Bappi Lahiri : డిస్కో కింగ్‌గా పిలవబడే ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పిలహరి ఇటీవలే కన్నుమూసిన విషయం విదితమే. తన పాటలతో ఆయన 1990లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈయన సంగీతం అందించిన అనేక సినిమాలు హిట్ అయ్యాయి. కేవలం బప్పిలహరి సంగీతం కోసమే అప్పట్లో ప్రేక్షకులు సినిమాలకు వెళ్లేవారు.. అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఈయన తన సంగీతంతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈయన హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అబ్‌స్ట్రిక్టివ్ స్లీప్ అప్నియా అనే వ్యాధి కారణంగా బప్పిలహరి నిద్రలోనే కన్నుమూశారు.
అయితే బప్పిలహరి ఎల్లప్పుడూ బంగారు ఆభరణాలను ఒంటి నిండా ధరిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఒక్కో సినిమాకు సంగీతం అందించినప్పుడల్లా ఆ సినిమాకు గుర్తుగా ఒక్కో ఆభరణాన్ని ధరిస్తూ వస్తున్నారు. అలా ఆయన వద్ద ఇప్పటికే చాలా బంగారం పేరుకుపోయింది. అయినప్పటికీ ఆయన ఓపిగ్గా నిన్న మొన్నటి వరకు ఆ ఆభరణాలను అన్నింటినీ రోజూ ధరిస్తూనే ఉన్నారు. ఇక ఇందుకు గాను ఆయన ఉదయమే 5.30 గంటలకు లేచి స్నానం చేసి అలంకరణ కార్యక్రమం మొదలు పెట్టేవారట.
అయితే బప్పిలహరి వద్ద అన్ని బంగారు ఆభరణాలు ఉన్నాయి కదా.. ఆయన వద్ద ఉన్న బంగారం పరిమాణం, విలువ.. ఎంత ఉంటుది ? అని తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన వద్ద 2014 లెక్కల ప్రకారం 754 గ్రాముల బంగారం, 4.62 కిలోల వెండి ఉన్నట్లు చెప్పారు. అప్పట్లో ఆయన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ పదవికి పోటీ చేశారు. దీంతో తన వద్ద ఉన్న ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో ప్రకటించారు. అందులో తన వద్ద ఉన్న బంగారం, వెండి వివరాలను ఆయన వెల్లడించారు.
అయితే బప్పిలహరి, ఆయన భార్య దగ్గర మొత్తం కలిపి సుమారుగా 5 నుంచి 6 కిలోల వరకు బంగారం ఉంటుందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన 754 గ్రాముల బంగారం మాత్రమే ఉందని చెప్పారట. అయితే ఈ లెక్కలు ఎలా ఉన్నా.. ఆయన వద్ద ఎంత బంగారం ఉన్నా.. ఇప్పుడిక ఆయన లేరు కనుక.. ఆ బంగారాన్ని ధరించలేరు. మరి ఆ బంగారాన్నంతా ఏం చేస్తారు ? అంటే.. ఆయన పేరిట ఒక చిన్న మ్యూజియం కట్టి ఆయన వస్తువులను, బంగారం, వెండి ఆభరణాలను అందులో ప్రదర్శనకు ఉంచుతారట. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఇటీవలే తెలియజేశారు. ఈ క్రమంలో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.