Dondakaya 65 : మనం అనేక రకాల కూరగాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో దొండకాయలు కూడా ఒకటి. ఇతర కూరగాయల లాగా ఇవి కూడా ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మనం దొండకాయలతో వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ 65 లాగా దొండకాయ 65 ని కూడా మనం తయారు చేసుకోవచ్చు. దొండకాయ 65 ని ఎక్కువగా హోటల్స్ లో, ఫంక్షన్స్ లో తయారు చేస్తూ ఉంటారు. హోటల్స్ లో ఉండే విధంగా మనం ఇంట్లోనే చాలా సులువుగా దొండకాయ 65 ని తయారు చేసుకోవచ్చు. దొండకాయ 65 ని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – పావు కిలో, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, పల్లీలు – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి – 2, కరివేపాకు – రెండు రెబ్బలు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5 లేదా 6, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
దొండకాయ 65 తయారీ విధానం..
ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి సన్నగా పొడుగ్గా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో శనగపిండి, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత దొండకాయలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె మాత్రమే ఉంచి మిగిలిన నూనెను తీసేసి పల్లీలను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలను, పసుపును వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించిన దొండకాయ ముక్కలను వేసి కలిపి ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ 65 తయారవుతుంది.దీనిని సాయంత్రం సమయాలలో స్నాక్స్ గా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి కూడా తినవచ్చు. దొండకాయలను తినడానికి ఇష్టపడని వారు అప్పుడప్పుడూ ఇలా దొండకాయలతో 65 ని చేసుకుని తినవచ్చు. దీంతో దొండకాయల రుచిని ఆస్వాదించవచ్చు.