Dondakaya Fry : దొండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దొండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. దొండకాయలతో ఎక్కువగా వేపుడును తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఈ దొండకాయ వేపుడును అందరూ ఇష్టపడేలా రుచిగా, కరకరలాడుతూ ఉండేలా తయారు చేసుకోవచ్చు. దొండకాయ వేపుడును చక్కగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – అరకిలో, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, ఎండుమిర్చి – 10 లేదా తగినన్ని, ధనియాలు – 2 టీ స్పూన్స్, మిరియాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మినపగుళ్లు – ఒక టీ స్పూన్, శనగపప్పు – అర టీ స్పూన్, మెంతులు – 10, ఎండు కొబ్బరి ముక్కలు – గుప్పెడు, నూనె – 7 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 8, ఉప్పు – తగినంత, పల్లీలు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఆవాలు – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్.
దొండకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక దొండకాయలను శుభ్రంగా కడిగి పలుచగా గుండ్రటి ముక్కలుగా తరగాలి. తరువాత ఒక కళాయిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మినపగుళ్లు, మెంతులు, ఎండుకొబ్బరి ముక్కలు, శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత ఒక టీ స్పూన్ నూనె వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలను రెండు భాగాలుగా చేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత ఈ దొండకాయ ముక్కలను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పల్లీలు వేసి వేయించాలి.
తరువాత ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.తరువాత మిక్సీ పట్టుకున్న కారం వేసి కలపాలి. తరువాత వేయించుకున్న దొండకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. దీనిని మరో మూడు నుండి నాలుగు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండకాయలను తినని వారు కూడా ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు.