Dondakaya Tomato Pachadi : మనం వంటింట్లో టమాటాలతో రకరకాల ఇన్ స్టాంట్ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసే పచ్చళ్లు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. టమాటాలతో మనం సులభంగా, త్వరగా చేసుకోదగిన పచ్చళ్లల్లో దొండకాయ టమాట పచ్చడి కూడా ఒకటి. దొండకాయ, టమాటాలు కలిపి చేసే ఈ పచ్చడి లొట్టలేసుకుంటూ తినేంత రుచిగా ఉంటుంది. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు ఎవరైనా ఈ పచ్చడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా లొట్టలేసుకుంటూ తినాలనిపించే ఈ దొండకాయ టమాట పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన దొండకాయలు – పావు కిలో, తరిగిన టమాటాలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), పచ్చిమిర్చి – 8, నూనె – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 6, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
దొండకాయ టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మినపప్పు వేసి వేయించాలి. మినపప్పు వేగిన తరువాత దానిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో దొండకాయ ముక్కలు , పసుపు వేసి కలపాలి. తరువాత వాటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. దొండకాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత వాటిపై మూత పెట్టి టమాట ముక్కలను పూర్తిగా మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు ఉంచాలి.
తరువాత జార్ లో వేయించిన పచ్చిమిర్చి, జీలకర్ర, మినపప్పు, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దొండకాయ ముక్కలు, టమాట ముక్కలు వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కొత్తిమీర వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా ఈ పచ్చడిని తినవచ్చు. దొండకాయలతో ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.