Dosa Avakaya Nilva Pachadi : దోసకాయలతో మనం రకరకాల వంటలను, పచ్చళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోసకాయలల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దోసకాయలతో కూరలే కాకుండా నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. దోసకాయలతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు అలాగే మొదటిసారిగా చేసే వారు కూడా ఈ పచ్చడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దోసకాయలతో రుచిగా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దోసకాయలు – 2, కారం – అర గ్లాస్, ఉప్పు – పావు గ్లాస్, ఆవ పిండి – పావు గ్లాస్, పల్లి నూనె – ముప్పావు కప్పు.

దోసకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా దోసకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వాటిని ముక్కలుగా కోసి మధ్యలో ఉండే గింజలను తీసి వేయాలి. అలాగే దోసకాయ చేదుగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత ఈ దోసకాయలను కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక గ్లాస్ తో కొలిచి గిన్నెలోకి తీసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలను కొలిచిన గ్లాస్ తో అర గ్లాస్ కారాన్ని, పావు గ్లాస్ ఉప్పును, పావు గ్లాస్ ఆవపిండిని తీసుకుని ముక్కల్లో వేసి కలుపుకోవాలి. తరువాత అదే గ్లాస్ తో ముప్పావు గ్లాస్ నూనెను వేసి కలుపుకోవాలి. దీనిపై మూతను ఉంచి ఒక రోజంతా అలాగే ఉంచాలి.
మరుసటి రోజు ఈ పచ్చడిని మరోసారి అంతా కలిపి ఒక గాజు సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ నిల్వ పచ్చడి తయారవుతుంది. దీనిని గాలి అలాగే తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల ఈ పచ్చడి నెలరోజులకు పైగా తాజాగా ఉంటుంది. కావాల్సినప్పుడు తగినంత పచ్చడిని తీసుకుని తాళింపు కూడా వేసుకోవచ్చు లేదా అలాగే తినవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ నిల్వ పచ్చడి తయారవుతుంది. వేడి వేడి అన్నంతో కలిపి తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.