Dosa Batter : మనలో చాలా మంది దోశలను ఇష్టంగా తింటారు. చట్నీ, సాంబార్ తో తింటే దోశలు చాలా రుచిగాఉంటాయి. మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ దోశలను తయారు చేస్తూ ఉంటాము. ఒక్కసారి దోశపిండిని తయారు చేసిపెట్టుకుంటే చాలు 4 నుండి 5 రోజుల వరకు చక్కగా దోశలను, పునుగులను తయారు చేసుకోవచ్చు. తరుచూ దోశలను తయారు చేస్తున్నప్పటికి మనలో చాలా మందికి దోశలు క్రిస్పీగా వచ్చేలా దోశపిండిని తయారు చేసుకోవడం రాదు. అలాంటి వారు కింద చెప్పిన విధంగా దోశపిండిని తయారు చేసుకోవడం వల్ల దోశలు రుచిగా ఉండడంతో పాటు పిండి కూడా చాలాకాలం పాటు నిల్వ ఉంటుంది. దోశలు రుచిగా, క్రిస్పీగా వచ్చేలా పర్పెక్ట్ దోశపిండిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోశ పిండి తయారీకి కావల్సిన పదార్థాలు..
దోశ బియ్యం లేదా రేషన్ బియ్యం – 5 గ్లాసులు, మెంతులు – ఒక టీ స్పూన్, శనగపప్పు – 5 టేబుల్ స్పూన్స్, మినపప్పు – ఒకటింపావు కప్పులు, అటుకులు – ఒకటింపావు గ్లాసులు.
దోశ పిండి తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బియ్యాన్ని తీసుకోవాలి. తరువాత మెంతులు, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. వీటిని 2 నుండి 3 సార్లు బాగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే పిండి పట్టుకోవడానికి పది నిమిషాల ముందు అటుకులను కడిగి నానబెట్టుకోవాలి. ఇందులో అటుకులకు బదులుగా అన్నాన్ని కూడా వేసుకోవచ్చు. తరువాత నానబెట్టిన పప్పులను, బియ్యాన్ని అలాగే అటుకులను కూడా గ్రైండర్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పిండిని గిన్నెలో వేసి మూత పెట్టి రాత్రంతా పులియబెట్టుకోవాలి. పిండి చక్కగా పులిసిన తరువాత అంతా కలిసేలా కలుపుకోవాలి.
తరువాత తగినంత పిండిని తీసుకుని అందులో ఉప్పు, నీళ్లు పోసి కలిపి దోశలాగా వేసుకోవాలి. మిగిలిన పిండిని అలాగే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పర్పెక్ట్ దోశ పిండి తయారవుతుంది. పిండిలో ఉప్పు ఫ్రిజ్ లో నిల్వ చేసుకోకూడదు. ఇలా తయారు చేసిన దోశపిండి 4 నుండి 5 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా దోశ పిండిని తయారు చేసుకుని రుచికరమైన, క్రిస్పీ దోశలను తయారు చేసుకుని తినవచ్చు.