Dosakaya Pachadi : దోసకాయను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దోసకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. దోసకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పప్పు, కూర, పులుసు వంటి వాటితో పాటు మనం పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. దోసకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం తరచూ తయారు చేస్తూనే ఉంటాం. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దోసకాయ – 1( మధ్యస్థంగా ఉన్నది), పచ్చిమిర్చి – 8 లేదా తగినన్ని, చింతపండు – 2 రెమ్మలు, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 3, ఇంగువ – చిటికెడు, పసుపు – పావు టీ స్పూన్.
దోసకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా దోసకాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, సగం దోసకాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమం మిగిలిన దోసకాయ ముక్కలు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దోసకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా అప్పుడప్పుడూ ఎంతో రుచిగా ఉండే పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఇంట్లో లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.