Dragon Fruit Milkshake : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి. ఈ పండ్లు మనకు విరివిరిగా లభిస్తాయి. ఇతర పండ్ల వలె డ్రాగన్ ఫ్రూట్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. వృద్దాప్య ఛాయలు దరి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఈ పండ్లను నేరుగా తినడంతో పాటు వీటితో ఎంతో రుచిగా ఉండే మిల్క్ షేక్ ను కూడా తయారు చేసుకుని తాగవచ్చు. ఈ మిల్క్ షేక్ ను తాగడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వర్షాకాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఈ డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
డ్రాగన్ ఫ్రూట్ – 1, కాచి చల్లార్చి ఫ్రిజ్ లో ఉంచిన పాలు – ఒక కప్పు, పటిక బెల్లం – రుచికి తగినంత, వెనీలా ఐస్ క్రీమ్ – ఒక స్కూబ్.
డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీ విధానం..
ముందుగా డ్రాగన్ ఫ్రూట్ తొక్కను తీసేసి లోపల ఉండే గుజ్జును ముక్కలుగా కట్ చేసుకుని జార్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో కాచి చల్లార్చిన పాలు, పటిక బెల్లం, ఐస్ క్రీమ్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని గ్లాస్ లో పోసుకుని పైన డ్రై ప్రూట్స్ తో గార్నిష్ చేసుకుని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ తయారవుతుంది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. షుగర్ వ్ఆయధితో బాధపడే వారు ఇందులో పటిక బెల్లం, ఐస్ క్రీమ్ వేసుకోకపోవడమే మంచిది. ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ తో మిల్క్ షేక్ ను తయారు చేసుకుని రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.