Pachadi : మనం వంటింట్లో విరివిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. టమాటాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. టమాటాలతో వివిధ రకాల కూరలను అదే విధంగా పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. టమాటాలను ఉపయోగించి చేసే కూరలు, పచ్చళ్లు ఎంతో రుచిగా ఉంటాయి. టమాటాలతో చేసుకోదగిన పచ్చళ్లలో టమాట కొత్తిమీర పచ్చడి కూడా ఒకటి.
టమాటాలను, కొత్తిమీరను కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు చాలా సులభంగా, రుచిగా మనం ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు కూడా చాలా సులభంగా ఈ పచ్చడిని తయారు చేయవచ్చు. టమాటలను, కొత్తిమీరను కలిపి చేసే ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కొత్తిమీర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన కొత్తిమీర – 3 కప్పులు, పెద్దగా తరిగిన టమాటాలు – 4 ( మధ్యస్థంగా ఉన్నవి), పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, పచ్చి మిర్చి – 12 లేదా రుచికి తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు – 5, చింతపండు – 5 గ్రాములు, ఉప్పు – తగినంత.

తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ.
టమాట కొత్తిమీర పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత కొత్తిమీరను వేసి కలుపుతూ వేయించాలి. తరువాత టమాట ముక్కలను కూడా వేసి మూత పెట్టి టమాట ముక్కలను పూర్తిగా ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత వేరే కళాయిలో పల్లీలను వేసి దోరగా వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి. అదే జార్ లో వెల్లుల్లి రెబ్బలను, చింతపండును కూడా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి.
తరువాత అదే జార్ లో టమాట కొత్తిమీర మిశ్రమాన్ని, తగినంత ఉప్పును కూడా వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయి తీసుకుని అందులో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు వేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట కొత్తిమీర పచ్చడి తయారవుతుంది.
దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతోనే కాకుండా ఈ పచ్చడిని ఉప్మా, దోశ, ఊతప్పం వంటి వాటితో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. నిల్వ పచ్చళ్లను తినడానికి బదులుగా ఇలా అప్పటికప్పుడు చాలా సులభంగా టమాట కొత్తిమీర పచ్చడిని చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.