Egg Biryani : మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటిని చాలా తక్కువ ధరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. కోడిగుడ్లతో చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ బిర్యానీ కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసినప్పటికి ఈ బిర్యానీ ఇతర నాన్ వెజ్ బిర్యానీలకు తక్కువగా కాకుండా చాలా రుచిగా ఉంటుంది. చాలా సులభంగా, అలాగే తక్కువ సమయంలో అయ్యేలా ఈ ఎగ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొత్తిమీర తరుగు – పావు కప్పు, పుదీనా తరుగు – పావు కప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ – పావు కప్పు, ఉడికించిన కోడిగుడ్లు – 4, యాలకులు – 2, లవంగాలు – 3, అనాస పువ్వు – 1, నల్ల యాలక్కాయ – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, పెరుగు – అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి చీలికలు – 2, నూనె – పావు కప్పు, నెయ్యి – పావు కప్పు.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒకటిన్నర కప్పు, నీళ్లు – రెండు లీటర్లు, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, లవంగాలు – 6, సాజీరా – ఒక టేబుల్ స్పూన్, నల్ల యాలకులు – 2, అసాన పువ్వు – 1, యాలకులు – 5, బిర్యానీ ఆకులు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – రెండు టేబుల్ స్పూన్స్.
ఎగ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా అడుగు భాగం మందంగా ఉండే ఒక గిన్నెను తీసుకుని అందులో నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత మరో గిన్నెలో 2 లీటర్ల నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక ఇందులో బియ్యం తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత ఇందులో నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని 90 శాతం ఉడికే వరకు ఉడికించాలి. తరువాత ఈ బియ్యాన్ని గంటెతో వడకట్టుకుంటూ ముందుగా మరో గిన్నెలో తయారు చేసుకున్న మసాలా మీద వేసుకోవాలి. ఇలా అన్నాన్ని వేసుకున్న తరువాత దానిపై నెయ్యి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్, పావు టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కుంకుమ పువ్వు కలిపిన నీటిని పోసి ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టి 8 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత దీనిపై మూతను తీయకుండా మరో 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ బిర్యానీ తయారవుతుంది. దీనిని నేరుగా లేదా రైతా, మిర్చి కా సాలన్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్లతో ఈ విధంగా చేసిన బిర్యానీని అందరూ ఇష్టంగా తింటారు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కోడిగుడ్లతో ఈ విధంగా బిర్యానీని కూడా తయారు చేసుకుని తినవచ్చు.