Egg Rice Recipe : కోడిగుడ్డుతో చేసుకోదగిన వంటకాల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఇది మనకు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలల్లో లభ్యమవుతుంది. ఈ ఫ్రైడ్ రైస్ ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఫ్రైడ్ రైస్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా , సులభంగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బాస్మతీ బియ్యం – 200 గ్రా., తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – అర కప్పు, చిన్నగా తరిగిన క్యారెట్ – 1, చిన్నగా తరిగిన బీన్స్ – 10, చిన్నగా తరిగిన క్యాప్సికం – 1, కోడిగుడ్లు – 4, నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – తగినంత, సోయా సాస్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టేబుల్ స్పూన్.
ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా ఉడికించిన అన్నాన్ని పొడి పొడిగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కోడిగుడ్లను వేసి వేయించుకోవాలి. కోడిగుడ్లు వేగిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత వెల్లుల్లి తరుగు వేసి వేయించుకోవాలి. తరువాత క్యారెట్, క్యాప్సికం, క్యారెట్ వేసి వేయించుకోవాలి. ఇందులో కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఈ కూరగాయ ముక్కలను పూర్తిగా ఉడికించుకోకూడదు.
ఇవి 50 శాతం వేగిన తరువాత పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని, వేయించిన కోడిగుడ్లను, ఉప్పును వేసి కలుపుకోవాలి. తరువాత సోయా సాస్, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. వంట చేయడానికి సమయం లేనప్పుడు అలాగే నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు.