Egg Rolls : కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని మనం విరివిరిగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. వీటితో కూరలే కాకుండా చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో తయారు చేసుకోగలిగిన చిరుతిళ్లల్లో ఎగ్ రోల్స్ కూడా ఒకటి. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు, నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు, అల్పాహారంగా ఏం చేయాలో తెలియనప్పుడు ఈ ఎగ్ రోల్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. చాలా తక్కువ సమయంలో ఎంతో రుచిగా ఉండే ఎగ్ రోల్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 6, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, క్యారెట్ తురుము – అర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, పచ్చిమిర్చి తరుగు – ఒకటిన్నర టీ స్పూన్, నూనె – ఒక టీ స్పూన్.

ఎగ్ రోల్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లను వేసుకోవాలి. తరువాత కోడిగుడ్లు కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నూనెతో సహా మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక దానిపై నూనెను వేసుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని పెద్ద గంటెతో తీసుకుని ఆమ్లెట్ లా వేసుకోవాలి. తరువాత దీనిపై మరికొద్దిగా నూనె వేస్తూ మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే కాల్చుకోవాలి. తరువాత ఈ ఆమ్లెట్ ను రోల్ లాగా చుట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ రోల్స్ ను కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ రోల్స్ తయారవుతాయి. వీటిని నేరుగా లేదా టమాట కిచప్ తో కలిపి తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ఈ ఎగ్ రోల్స్ ను పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా ఈ ఎగ్ రోల్స్ ను తయారు చేసుకుని తినవచ్చు.