Egg Tomato Curry : మన శరీరానికి కావల్సిన పోషకాలను తక్కువ ఖర్చులో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో సులభంగా చేసుకోదగిన కూరలల్లో కోడిగుడ్డు టమాట కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కోడిగుడ్డు టమాట కూరను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేసే కోడిగుడ్డు కూర చాలా రుచిగా ఉంటుంది. ఎగ్ టమాట కర్రీని రుచిగా తయారు చేసుకునే విధానాన్ని అలాగే తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ టమాట కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 6, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద టమాటాలు – 3,కారం – ఒక టిన్నర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు లేదా తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఎగ్ టమాట కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి కలపాలి. తరువాత కోడిగుడ్లకు గాట్లు పెట్టుకుని వేసుకోవాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత కరివేపాకు వేసి కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించాలి.
తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత వేయించిన కోడిగుడ్లు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ టమాట కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎగ్ టమాట కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరచూ చేసే ఎగ్ టమాట కర్రీ కంటే ఈ విధంగా చేసే ఎగ్ టమాట కర్రీ మరింత రుచిగా ఉంటుంది.