Masala Vada : సాయంత్రం కాగానే మనకు రోడ్ల పక్కన బండ్ల మీద రకరకాల చిరుతిళ్లు లభ్యమవుతతాయి. వాటిల్లో మసాలా వడలు కూడా ఒకటి. ఈ మసాలా వడలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అచ్చం బయట లభించే విధంగా ఈ మసాలా వడలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మసాలా వడలను తయారు చేయడం చాలా సులభం. కరకరలాడుతూ రుచిగా ఉండేలా ఈ మసాలా వడలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రీట్ స్టైల్ మసాలా వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక కప్పు, అల్లం – రెండు ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, తరిగిన కరివేపాకు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా పొడి – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్ట్రీట్ స్టైల్ మసాలా వడ తయారీ విధానం..
ఈ వడలను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత దానిలో తగినన్ని నీళ్లు పోసి 3 నుండి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీటిని వడకట్టి ఈ పప్పును ఒక జార్ లోకి తీసుకోవాలి. జార్ లో వేసేటప్పుడు మొత్తం పప్పును కాఉండా ఒక గుప్పెడు పప్పును పక్కకు తీసి ఒక గిన్నెలో వేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి నీళ్లు పోయకుండా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే మిగిలిన శనగపప్పును కూడా వేయాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడాయ్యక తగిన పరిమాణంలో పిండిని తీసుకుని మరీ మందంగా, మరీ పలుచగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా వడ ఆకారంలో వత్తుకుని నూనెలో వేయాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా, కరకరలాడే వరకు కాల్చుకుని టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే మసాలా వడలు తయారవుతాయి. వీటిని వేడిగా ఉన్నప్పుడు తింటేనే వీటి రుచి తెలుస్తుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ వడలు చక్కగా ఉంటాయి.