Foxtail Millet Upma : చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రల గురించి అందరికీ తెలిసిందే. వీటిని ప్రస్తుత తరుణంలో చాలా మంది తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకు కారణం వీటిల్లో ఉండే ఔషధగుణాలే అని చెప్పవచ్చు. కొర్రలను తినడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. పైగా పోషణ లభిస్తుంది. బరువు తగ్గుతారు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొర్రలను తింటాం కానీ.. వాటిని ఎలా వండుకోవాలా.. అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే కింద తెలిపిన విధంగా చేస్తే కొర్రలతో ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ అవుతుంది. దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రూపంలో లేదా రాత్రి అల్పాహారంగా కూడా తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. డైట్ పాటించే వారికి ఇది చక్కని ఆహారం అని చెప్పవచ్చు. ఇక కొర్రలతో ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొర్రల ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
కొర్రలు – 1 కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు, ఆవాలు – అర టీస్పూన్, మినప పప్పు – ఒక టీస్పూన్, శనగపప్పు – ఒక టీస్పూన్, ఉల్లిపాయ – 1, టమాటా – 1, పచ్చి మిర్చి – 2, కరివేపాకు రెబ్బలు – 2, అల్లం తరుగు – 1 టీస్పూన్, క్యారెట్ – 1, బీన్స్ – 5, పచ్చి బఠాణీ – పావు కప్పు, పసుపు – పావు టీస్పూన్, నూనె – 3 పెద్ద టీస్పూన్లు, ఉప్పు – తగినంత, కొత్తిమీర – ఒక కట్ట, కొబ్బరి తురుము – పావు కప్పు.

కొర్రల ఉప్మాను తయారు చేసే విధానం..
కొర్రలను 2 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప పప్పు వేసి వేయించుకుని కరివేపాకు, పచ్చి మిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. ఆ తరువాత ఉల్లిపాయ తరుగు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, బీన్స్ ముక్కలు, పచ్చి బఠాణీలు వేసి బాగా వేయించి పసుపు, కొర్రలు, తగినంత ఉప్పు, నీళ్లు పోసి మూత పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. దీంతో ఎంతో రుచికరమైన కొర్రల ఉప్మా రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏదైనా పచ్చడి, చట్నీ, కూరతోనూ తినవచ్చు. కొర్రల ఉప్మాను ఇలా చేసి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా సరే తినవచ్చు. వీటిని తినడం వల్ల షుగర్ లెవల్స్ కూడా పెరగవు. అందువల్ల షుగర్ ఉన్నవారు సైతం ఎలాంటి జంకు లేకుండా ఈ ఉప్మాను తినవచ్చు. దీంతో బోలెడు ప్రయోజనాలను పొందవచ్చు.