Garlic Fried Rice : మనకు రెస్టారెంట్ లలో లభించే రైస్ వెరైటీలలో గార్లిక్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. గార్లిక్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. వెల్లుల్లితో చేసే ఈ ఫ్రైడ్ రైస్ తిన్నా కొత్తి తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో, నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా వెల్లుల్లితో ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ గార్లిక్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గార్లిక్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక కప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 20, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన క్యారెట్ – 1, చిన్నగా తరిగిన బీన్స్ – 2, రెడ్ చిల్లీ సాస్ – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, వెనిగర్ – ఒకటిన్నర టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, పంచదార – అర టీ స్పూన్.
గార్లిక్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో ఉప్పు, నూనె వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి 90 శాతం ఉడికించి స్టవ్ఆఫ్ చేసుకోవాలి. తరువాత నీటిని వడకట్టి అన్నాన్ని ప్లేట్ లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లులి తరుగు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత రెడ్ చిల్లీ సాస్ వేసి కలపాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నీళ్లు కూడా పోసి కలపాలి. తరువాత ఉడికించిన అన్నం, వెల్లుల్లి, సోయాసాస్, వెనిగర్, ఉప్పు, పంచదార వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి.
దీనిని మరో రెండు నుండి మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గార్లిక్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తింటే ఇది మరింత రుచిగా ఉంటుంది. తరుచూ చేసే ఫ్రైడ్ రైస్ లతో పాటు ఇలా వెల్లుల్లితో కూడా రుచికరమైన ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.