Gongura Meal Maker : మీల్ మేకర్.. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మీల్ మేకర్ లతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మీల్ మేకర్ లతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో గోంగూర మీల్ మేకర్ కూర కూడా ఒకటి. మీల్ మేకర్, గోంగూర కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ కూరను తయారు చేయడం కూడా చాలా సులభం. పుల్ల పుల్లగా, రుచిగా ఉండే గోంగూర మీల్ మేకర్ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర మీల్ మేకర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – రెండు కప్పులు, గోంగూర – ఒక కట్ట, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 2, తరిగిన టమాట – 1, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, గరంమసాలా -ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కసూరి మెంతి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, అల్లం – అర ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 4, పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్స్, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, జీడిపప్పు – 5.
గోంగూర మీల్ మేకర్ తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ లో వేడి నీటిని పోసి నానబెట్టాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత శుభ్రం చేసుకున్న గోంగూరను వేసి మూత పెట్టి మగ్గించాలి. గోంగూర పూర్తిగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత మరో జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు, తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత మీల్ మేకర్ లలో ఉండే నీటిని పిండేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
తరువాత ఒక చిన్న టమాటాను ముక్కలుగా చేసి వేసుకోవాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, గోంగూర పేస్ట్ వేసి కలపాలి. తరువాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించిన తరువాత మీల్ మేకర్, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కసూరి మెంతి, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర మీల్ మేకర్ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీల్ మేకర్ లతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.