Gongura Pandu Mirapakaya Pachadi : గోంగూర పండు మిర‌ప‌కాయ ప‌చ్చ‌డి.. ఇలా పెట్టండి.. ఏడాదిపాటు నిల్వ ఉంటుంది..!

Gongura Pandu Mirapakaya Pachadi : గోంగూర‌తో మ‌నం వివిధ ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. గోంగూరతో చేసే ఈ ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. గోంగూర‌తో ఇన్ స్టాంట్ గా చేసే ప‌చ్చళ్ల‌తో పాటు సంవ‌త్స‌ర‌మంతా నిల్వ ఉండే ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా గోంగూర‌తో చేసే నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ల్లో గోంగూర పండుమిర్చి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఈ గోంగూర పండుమిర్చి కలిపి చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. పండుమిర్చి ల‌భించిన‌ప్పుడు ఇలా ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ గోంగూర పండుమిర‌ప‌కాయ‌ల ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర పండు మిర‌పకాయ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పండుమిర‌ప‌కాయ‌లు – పావుకిలో, గోంగూర – 350 గ్రా నుండి 400 గ్రా., మెంతులు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, నూనె – పావు క‌ప్పు, చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌, ఉప్పు – 75 గ్రా., ప‌సుపు – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – పావు క‌ప్పు.

Gongura Pandu Mirapakaya Pachadi recipe in telugu very tasty easy to make
Gongura Pandu Mirapakaya Pachadi

తాళింపుకు కావల్సిన ప‌దార్థాలు..

నూనె – పావు క‌ప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 5, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఇంగువ – కొద్దిగా.

గోంగూర పండు మిర‌పకాయ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా పండుమిర‌ప‌కాయ‌లు తొడిమెల‌తో స‌హా శుభ్ర‌ప‌రుచుకోవాలి. త‌రువాత వీటిని త‌డి ఆరేంత వ‌ర‌కు రాత్రంతా ఆర‌బెట్టాలి. త‌రువాత గోంగూర‌ను కూడా శుభ్రంగా క‌డిగి రాత్రంతా ఆర‌బెట్టాలి. త‌రువాత పండుమిర‌ప‌కాయ‌ల‌కు ఉన్న తొడిమెల‌ను తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మెంతులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనెవేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక చింత‌పండును శుభ్రం చేసి వేసుకోవాలి. త‌రువాత గోంగూర‌ను వేసి క‌లుపుతూ వేయించాలి. దీనిపై మూత పెట్ట‌కుండా గోంగూర‌ను నూనెలో బాగా వేయించాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి గోంగూర‌ను చ‌ల్లారనివ్వాలి. గోంగూర చ‌ల్లారిన త‌రువాత జార్ లో క‌ట్ చేసిన పండుమిర్చి ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత గోంగూర వేసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గోంగూర పండుమిర్చి ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చ‌డిని ఇలాగే నిల్వ చేసుకోవ‌చ్చు. మ‌న‌కు కావ‌ల్సిన‌ప్పుడు తాళింపు వేసుకోవ‌చ్చు. లేదంటే ప‌చ్చ‌డిని అంతా ఒకేసారి తాళింపు చేసి కూడా నిల్వ చేసుకోవ‌చ్చు. ప‌చ్చ‌డి తాళింపు కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. త‌రువాత ఈ తాళింపును ప‌చ్చ‌డిలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర పండు మిర‌ప‌కాయ‌ల ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts