Gongura Vankaya : గోంగూర వంకాయ.. గోంగూర, వంకాయలు కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు. అంత రుచిగా ఉంటుంది ఈ కూర. ఈ కూరను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసే వారు, బ్యాచిలర్స్ ఎవరైనా చాలా తేలికగా తక్కువ సమయంలో ఈ కూరను తయారు చేసుకోవచ్చు. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఈ కూరను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ గోంగూర వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో… ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర వంకాయ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, గోంగూర – ఒక కట్ట, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 5, తరిగిన పచ్చిమిర్చి – 3, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ- పెద్దది ఒకటి, తరిగిన టమాటాలు – 2, వంకాయలు – 200గ్రా., ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్.
గోంగూర వంకాయ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత గోంగూర వేసి వేయించాలి. దీనిని మెత్తగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఈ గోంగూరను జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీపట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో మరో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత టమాటాలు వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. తరువాత వంకాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. వంకాయలు మగ్గి నూనె పైకి తేలిన తరువాత ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న గోంగూర వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర వంకాయ తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన గోంగూర వంకాయ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.