Green Mango Rasam : మామిడికాయల సీజన్ ఇది. ఎటు చూసినా మనకు భిన్న వెరైటీలకు చెందిన కాయలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే మామిడి పండ్లను ఆస్వాదిస్తున్నారు. పచ్చి మామిడికాయలతో పచ్చళ్లు, పప్పు వంటివి చేస్తున్నారు. అయితే పచ్చి మామిడి కాయలతో ఎంతో రుచిగా ఉండే రసం కూడా చేయవచ్చు. దీన్ని చేయడం సులభమే. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడికాయ రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి మామిడికాయ ముక్కలు – ఒక కప్పు, టమాటా ముక్కలు – అర కప్పు, కందిపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – సరిపడా, కరివేపాకు – రెండు రెబ్బలు, ఎండు మిర్చి – మూడు, మిరియాలు – ఒక టీస్పూన్, ధనియాలు – ఒక టీస్పూన్, జీలకర్ర – ఒక టీస్పూన్, అల్లం తురుము – అర టీస్పూన్, వెల్లుల్లి తురుము – అర టీస్పూన్, ఆవాలు – ఒక టీస్పూన్, పసుపు – ఒక టీస్పూన్, నూనె – ఒక టీస్పూన్.
మామిడి కాయ రసం తయారీ విధానం..
బాణలిలో కందిపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేయాలి. ఓ గిన్నెలో పచ్చి మామిడికాయ ముక్కలు, టమాటాలు వేసి అవి మునిగే వరకు నీళ్లు పోసి ఉడికించి చల్లారాక గుజ్జులా చేయాలి. తరువాత అందులో సరిపడా నీళ్లు పోసి, పసుపు, అల్లం, వెల్లుల్లి తురుము వేసి కలపాలి. కందిపప్పు, మిరియాల పొడిని కూడా వేసి మరిగించాలి. తరువాత ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకులతో తాళింపు పెడితే సరిపోతుంది. దీంతో ఎంతో రుచిగా ఉండే మామిడికాయ రసం రెడీ అవుతుంది. దీన్ని చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అన్నంలో వేడి వేడిగా తింటే రుచి ఎంతో సూపర్‌గా ఉంటుంది.