Gummadikaya Pulusu : మనం గుమ్మడికాయను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గుమ్మడికాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడికాయను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఈ గుమ్మడికాయతో మనం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. గుమ్మడికాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు ఎవరరైనా ఈ పులుసును సులభంగా చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే గుమ్మడికాయ పులుసు తయారీ విధానాన్ని అలాగే తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడికాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
గుమ్మడికాయ – అరకిలో, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కరివేపాకు – కొద్దిగా, ఇంగువ – పావు టీ స్పూన్.

గుమ్మడికాయ పులుసు తయారీ విధానం..
ముందుగా గుమ్మడికాయకు ఉండే చెక్కును తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత వీటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, మెంతులు వేసి వేయించాలి. తాళింపు దినుసులు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు, పసుపుచ కారం, శనగపిండి వేసి 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. తరువాత చింతపండు రసం, 2 గ్లాసుల నీళ్లు పోసి కలపాలి. తరువాత బెల్లం తురుము వేసి కలపాలి.
ఇప్పుడు దీనిపై మూత పెట్టి 30 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత మూత తీసి మరోసారి అంతా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుమ్మడికాయ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గుమ్మడికాయతో ఈ విధంగా చేసిన పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.