Guntha Ponganalu : మనం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా దోశలను తయారు చేస్తూ ఉంటాం. ఈ దోశ పిండితోనే గుంత పొంగనాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. మాములుగా తయారు చేసే గుంత పొంగనాల కంటే కింద చెప్పిన విధంగా తయారు చేసే గుంత పొంగనాలు మరింత రుచిగా ఉంటాయి. ఎంతో రుచిగా గుంత పొంగనాలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుంత పొంగనాల తయారీకి కావల్సిన పదార్థాలు..
దోశ పిండి – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 4, క్యారెట్ తరుము – పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
గుంత పొంగనాల తయారీ విధానం..
ముందుగా దోశ పిండిలో ఉప్పు, తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. తరువాత పొంగనాలను తయారు చేసుకునే పాత్రలో ఉండే అన్ని గుంతలలో కొద్ది కొద్దిగా నూనెను వేయాలి. నూనె వేడి అయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని వేసి మూత పెట్టాలి. 5 నిమిషాల తరవాత మూత తీసి పొంగనాలను మరో వైపుకు తిప్పి మరో 2 నిమిషాల పాటు ఉంచాలి. పొంగనాలు రెండు వైపులా ఎర్రగా అయిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొంగనాలు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీ, మజ్జిగ చారుతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా వీటిని తినవచ్చు.