Guthi Bendakaya : మసాలా గుత్తి బెండకాయ వేపుడు.. బెండకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. ప్రత్యేకంగా మసాలా పొడి తయారు చేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలను తినని వారు కూడా వీటిని ఇష్టంగా తింటారు. వెరైటీ వంటకాలను రుచి చేయాలనుకునే వారు దీనిని తప్పకుండా రుచి చూడాల్సిందే. ఈ వేపుడును తయారు చేయడం చాలా తేలిక. ఎవరైనా చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మసాలా గుత్తి బెండకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా గుత్తి బెండకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 10 నుండి 15, ధనియాలు – పావు కప్పు, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మల- 10, పల్లీలు – పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, పసుపు- పావు టీ స్పూన్, నువ్వులు -ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, లేత బెండకాయలు – 300గ్రా..
మసాలా గుత్తి బెండకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ధనియాలు, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి రెమ్మలు, పల్లీలు, జీలకర్ర వేసి వేయించాలి. వీటిని మాడిపోకుండా దోరగా వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు పసుపు, నువ్వులు, ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత జార్ లో వేసి మెత్తని పొడిగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తరువాత బెండకాయల తొడిమెలను తీసేసి వాటికి మధ్యలోకి నిలువుగా గాట్లు పెట్టుకోవాలి. తరువాత అందులో మసాలా పొడిని స్టఫ్ చేసుకోవాలి.
ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయలు వేసి మూత పెట్టి చిన్న మంటపై 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత బెండకాయలను అటూ ఇటూ తిప్పుతూ పూర్తిగా వేయించాలి. బెండకాయలు వేగిన తరువాత కొద్దిగా ఉప్పు, మిగిలిన కారం పొడి వేసి కలిపి మూత పెట్టాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా గుత్తి బెండకాయ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.