Biyyam Pindi Rotte : మనం వంటింట్లో బియ్యం పిండిని ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో రొట్టెలను కూడా తయారు చేసుకోవచ్చు. పూర్వ కాలంలో బియ్యం పిండితో రొట్టెలను ఎక్కువగా తయారు చేసేవారు. బియ్యం పిండితో చేసే రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి. బియ్యం పిండితో రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి రొట్టెల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒకటిన్నర కప్పు, నానబెట్టుకున్న శనగ పప్పు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, సన్నగా తరిగిన కరివేపాకు – ఒక రెబ్బ, నూనె – ఒక కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – తగినన్ని.
బియ్యం పిండి రొట్టెల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చి మిర్చి, నానబెట్టుకున్న శనగపప్పు, బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, తరిగిన కరివేపాకును వేసి కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథీన్ కవర్ పై నూనెను వేసి కావల్సిన పరిమాణంలో పిండిని తీసుకుని మరీ పలుచగా కాకుండా చేత్తో వత్తుకుంటూ రొట్టెలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెనంపై నూనె వేసి ముందుగా చేసి పెట్టుకున్న రొట్టెను వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బియ్యం పిండి రొట్టెలు తయారవుతాయి. ఇలా చేసుకున్న రొట్టెలు రెండు రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ రొట్టెలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో లేదా సాయంత్రం స్నాక్స్ గా కూడా తినవచ్చు.