Chakkera Pongali : చక్కెర పొంగలి.. ఈ పేరు చెబితేనే నోట్లో నీళ్లూరతాయి. ఇది అంతటి రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొందరు పూర్తిగా చక్కెర లేదా పూర్తిగా బెల్లంతో తయారు చేస్తారు. అయితే అలా కాకుండా దీన్ని కాస్తంత చక్కెర, బెల్లం కలిపి తయారు చేస్తే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన చక్కెర పొంగలి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. శక్తిని అందిస్తుంది. ఇక బెల్లం, చక్కెర కలిపి పొంగలిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెర పొంగలి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ముప్పావు కప్పు, పెసర పప్పు – పావు కప్పు, బెల్లం – ఒక కప్పు, పంచదార – అర కప్పు, జీడి పప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండు ద్రాక్ష – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – మూడు కప్పులు, పచ్చ కర్పూరం – చిటికెడు కంటే తక్కువ.
చక్కెర పొంగలి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి కాగాక జీడి పప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత ఒక కుక్కర్ లో పెసర పప్పును వేసి వేయించుకోవాలి. తరువాత అదే కుక్కర్ లో బియ్యాన్ని, తగినన్ని నీళ్లను పోసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు కుక్కర్ లో రెండు కప్పుల నీళ్లను పోసి మూత పెట్టి, మధ్యస్థ మంటపై మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బెల్లం, పంచదార వేసి ఒక కప్పు నీళ్లను పోసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత జల్లి గంట సహాయంతో వడబోసుకుంటూ ఉడికించి పెట్టుకున్న అన్నంలో పోయాలి. తరువాత మధ్యస్థ మంటపై అన్నం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. తరువాత నెయ్యి, యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. చివరగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, పచ్చ కర్పూరం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి తయారవుతుంది. ఇలా చేసిన చక్కెర పొంగలి ఎంతో రుచిగా ఉంటుంది.