Healthy Rasam : మన ఆరోగ్యానికి ఉసిరికాయలు ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. ఉసిరికాయలతో చట్నీ వంటి వాటినే కాకుండా రసం కూడా తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయలతో చేసే ఈ రసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయలతో రుచిగా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయ రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
మిరియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 6, ఉడికించిన కందిపప్పు – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ముప్పావు లీటర్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, దంచిన ఉసిరికాయలు – 4, తరిగిన టమాటాలు – 2, కరివేపాకు – 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 4, బెల్లం తురుము – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, ఆవాలు – అర టీస్పూన్, మెంతులు – అర టీ స్పూన్, ఇంగువ – కొద్దిగా.
ఉసిరికాయ రసం తయారీ విధానం..
ముందుగా రోట్లో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తరువాత కందిపప్పు ఉడికించి ఒక కప్పు పప్పు అయ్యేలా పలుచగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, ఉసిరికాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, మిరియాల మిశ్రమం వేసి చేత్తో నలుపుతూ కలుపుకోవాలి. తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి 15 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత పప్పు, బెల్లం తురుము వేసి మరో 5 నిమిషాల పాటు మరిగించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడిచేయాలి. తరువాత తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని రసంలో వేసి కలుపుకోవాలి. ఇలా చయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ రసం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.