Tamarind : చింతపండును మనం నిత్యం అనేక వంటల్లో వేస్తుంటాం. చింతపండును అనేక రకాల పప్పులలో పులుపు కోసం వేస్తుంటారు. దీంతో రసం, సాంబార్, పప్పుచారు చేస్తుంటారు. అలాగే చింతపండుతో చేసే పులిహోర అంటే ఎంతో మందికి ఇష్టం. చింతకాయ పచ్చడి అయితే చెప్పలేనంత టేస్ట్‌గా ఉంటుంది. ప్రత్యేకంగా దీనికి అభిమానులు కూడా ఉంటారు. అయితే చింతపండును మనం కేవలం వంటలకే కాదు, పలు ఇతర పనులకు కూడా ఉపయోగించవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు క్లీనింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. నిమ్మలాగే చింతపండులోనూ స్ట్రాంగ్ యాసిడ్ గుణాలు ఉంటాయి. అందువల్ల చింతపండుతో వేటినైనా సరే క్లీన్ చేయవచ్చు. ముఖ్యంగా వంటపాత్రలు లేదావెండి సామాన్లను దీంతో క్లీన్ చేయవచ్చు. దీంతో అవి మెరుస్తాయి. అలాగే చింతపండులో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి కనుక చింతపండుతో వంటపాత్రలను తోమితే దాంతో వంటపాత్రలపై ఉండే క్రిములు నశిస్తాయి. దీని వల్ల రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. అయితే చింతపండును కాసేపు నీటిలో నానబెట్టి అందులో కాస్త ఉప్పు కలిపి వాడితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
దోమల, ఈగలు, పురుగులను తరిమేందుకు..
మీ ఇంట్లో ఈగలు, దోమలు, పురుగులు, బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయా. అయితే వాటిని తరిమేందుకు కూడా చింతపండు పనిచేస్తుంది. చింత పండు పేస్ట్‌ను అవి తిరిగే చోట్ల ఉంచితే చాలు, చింతపండు నుంచి వచ్చే వాసనకు అవి పారిపోతాయి. దీంతో ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఆహారం కూడా ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటుంది. అలాగే మీకు ఇంట్లో సబ్బును తయారు చేయడం తెలిస్తే అందులో చింతపండు కలిపి తయారు చేయవచ్చు. అలా తయారు చేసిన సబ్బును వాడితే మీ చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి.
చింతపండులో టానిన్స్ అనబడే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల చింతపండు కాటన్, ఉన్ని, ఇతర వస్త్రాలకు బాగా అంటుకుంటుంది. అందువల్ల చింతపండును మీరు సహజసిద్ధమైన ఎకో ఫ్రెండ్లీ డై గా కూడా ఉపయోగించవచ్చు. చింతపండుతో చర్మాన్ని, జుట్టును సంరక్షించుకోవచ్చు. చింతపండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి మెరుపును తెస్తాయి. అలాగే శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. చుండ్రును తగ్గిస్తాయి. ఇలా చింతపండును మనం కేవలం వంటలకు మాత్రమే కాకుండా పలు ఇతర విధాలుగా కూడా ఉపయోగించవచ్చు.