Hotel Style Aloo Samosa : ఆలూ సమోసా.. ఇది తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఎంతో కాలంగా వీటిని స్నాక్స్ గా తయారు చేసుకుని తింటూ ఉన్నాం. రుచిగా కరకరలాడుతూ ఉండే ఈ సమోసాలను చాలా మంది ఇష్టంగా తింటారు. వివిధ రుచుల్లో సమోసాలు లభ్యమవుతున్నప్పటికి ఆలూ సమోసాలనే చాలా మంది ఇష్టపడతారు. బయట విరివిరిగా ఈ సమోసాలు మనకు లభ్యమవుతూ ఉంటాయి. ఇలా రుచిగా కరకరలాడుతూ ఉండే సమోసాలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. రుచిగా సమోసాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, కరిగించిన నెయ్యి – 4 టీ స్పూన్స్, వాము – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, జీలకర్ర – ఒక టీ స్పూన్, కచ్చాపచ్చాగా దంచిన ధనియాలు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, ఉల్లి తరుగు – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు పలుకులు – 3 టేబుల్ స్పూన్స్, చాట్ మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా పొడి – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు – 200 గ్రా., నిమ్మరసం – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – 2 టీ స్పూన్స్.
ఆలూ సమోసా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోవాలి. అందులో నెయ్యి, ఉప్పు, వాము వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా ఎక్కువ సేపు కలుపుకోవాలి. తరువాత ఈ పిండిని ఉండలుగా చేసుకుని వాటిపై తడి వస్త్రాన్ని కప్పి 30 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి.
ఇవి వేగిన తరువాత ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని నిమిషం పాటు వేయించిన తరువాత బంగాళాదుంప ముక్కలను వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. దీనిని చల్లగా అయ్యే వరకు పక్కకు ఉంచాలి. ఇప్పుడు పిండి ఉండను తీసుకుని వీలైనంత పలుచగా చపాతీలా వత్తుకోవాలి. తరువాత దీనిని రెండు భాగాలుగా కట్ చేసుకుని ఒక భాగాన్ని చేతిలోకి తీసుకోవాలి. తరువాత ఒక అంచుకు నీటితో తడి చేసి సమోసాలా చుట్టుకోవాలి. దీనిలో ముందుగా తయారు చేసుకున్న ఆలూ మిశ్రమాన్ని తగినంత ఉంచి అంచులకు మరలా తడి చేసి అంచులను చక్కగా మూసివేయాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత 15 నిమిషాల పాటుగాలికి ఆరబెట్టాలి.
తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సమోసాలను వేసి చిన్న మంటపై వేయించుకోవాలి. వీటిని కదుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే ఆలూ సమోసాలు తయారవుతాయి. వీటిని గ్రీన్ చట్నీ, టమాట కిచప్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా ఇలా సమోసాలను తయారు చేసుకుని తినవచ్చు. బయట అపరిశుభ్ర వాతావరణంలో వాతావరణంలో తయారు చేసిన సమోసాలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక ఇలా సమోసాలను ఇంట్లోనే తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది.