Pav Bhaji : మనకు సాయంత్రం సమయంలో లభించే చిరుతిళ్లల్లో పావ్ భాజీ ఒకటి. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. తింటూ ఉంటే తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ పావ్ భాజీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టపడతారు. బయట చాట్ దుకాణాల్లో లభించే విధంగా ఉండే ఈ పావ్ భాజీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. చక్కటి రుచిని కలిగి ఉండేలా ఈ పావ్ భాజీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పావ్ భాజీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – రెండు టేబుల్ స్పూన్స్, బటర్ – పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), క్యాప్సికం తరుగు – ముప్పావు కప్పు, వేడి నీటిలో నానబెట్టిన పచ్చి బఠాణీ – ముప్పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాట – 1 ( పెద్దది), కసూరి మెంతి – ఒక టీ స్పూన్, పావ్ భాజీ మసాలా – 2 టేబుల్ స్పూన్స్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, మెత్తగా ఉడికించిన బంగాళాదుంప – 1 ( పెద్దది), నీళ్లు – 300 ఎమ్ ఎల్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్, లడీ పావ్ – 4.
పావ్ భాజీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె, 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి వేడి చేయాలి. బటర్ కరిగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత క్యాప్సికం తరుగు, పచ్చి బఠాణీ వేసి మూడు నిమిషాల పాటు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట తరుగు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత కసూరి మెంతి, పావ్ భాజీ మసాలా, కారం, ఉప్పు వేసి కలపాలి. తరువాత బంగాళాదుంపను మెత్తగా చేసి వేసి కలపాలి. తరువాత మ్యాషర్ తో పేస్ట్ లా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసిన తరువాత నీళ్లు పోసి మంటను పెద్దగా చేసి మరలా మ్యాష్ చేసుకోవాలి. తరువాత కొత్తిమీర తరుగు వేసి దగ్గర పడే వరకు ఉడికించాలి.
ఇప్పుడు బటర్ వేసి బటర్ కరిగేంత వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత పెనం మీద బటర్ ను వేసి బటర్ కరిగిన తరువాత దానిపై లడీ పావ్ ను మధ్యలోకి కట్ చేసి ఉంచాలి. దీనిని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పావ్ భాజీని వేడి వేడిగా ఉల్లిపాయ, బటర్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో ఈ పావ్ భాజీని స్నాక్స్ గా చేసుకుని తినవచ్చు. దీనిలో ఎంత ఎక్కువ బటర్ ను వేస్తే అంత రుచిగాఉంటుంది. బయట తయారు చేసిన పావ్ భాజీని తినడం కంటే ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న పావ్ భాజీని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది.