Hotel Style Tomato Soup : మనకు రెస్టారెంట్ లలో లభించే వాటిలో సూప్ లు కూడా ఒకటి. సూప్ ను వేడి వేడిగా తాగుతూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. మనలో చాలా మంది ఇష్టంగా తాగే సూప్ లల్లో టమాట సూప్ కూడా ఒకటి. టమాట సూప్ చాలా రుచిగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా టమాట సూప్ ను తాగుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పవలసిన పని లేదు. రెస్టారెంట్ లలో లభించే ఈ టమాట సూప్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు, జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలు ఉన్న వారు ఇలా అప్పటికప్పుడు టమాట సూప్ ను తయారు చేసుకుని తాగవచ్చు. రెస్టారెంట్ స్టైల్ టమాట సూప్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బటర్ – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – 1, వెల్లుల్లి రెబ్బలు – 4, మిరియాలు – పావు టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – చిన్నది ఒకటి, తరిగిన టమాటాలు – 4, నీళ్లు – అర కప్పు, ఫుడ్ కలర్ – చిటికెడు, పంచదార – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – తగినంత, వెనిగర్ – ఒక టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, టమాట సాస్ – ఒక టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట సూప్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. తరువాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, అల్లం తరుగు, ఉల్లిపాయ, టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిలో నుండి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు తీసేసి మిగిలిన పదార్థాలను జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత అర కప్పు నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టి కళాయిలోకి తీసుకోవాలి. ఇందులో రెండున్నర కప్పుల నీళ్లు పోసి మరలా వేడి చేయాలి.ఈ సూప్ మరిగిన తరువాత ఇందులో ఫుడ్ కలర్ వేసి కలపాలి. తరువాత పంచదార, ఉప్పు, వెనిగర్, టమాటసాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, మిరియాల పొడి వేసి కలపాలి.
వీటిని రెండు నిమిషాల పాటు మరిగించిన తరువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఈ కార్న్ ఫ్లోర్ ను సూప్ లో వేసి కలపాలి. సూప్ ను దగ్గర పడే వరకు ఉడికించి పైన కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట సూప్ తయారవుతుంది. ఈ సూప్ ను వేడి వేడిగా తాగితే చాలా రుచిగా ఉంటుంది. బ్రెడ్ క్రంబ్స్ తో ఈ సూప్ ను తీసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా టమాట సూప్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.