Egg Bhurji : కోడిగుడ్డు అంటే చాలా మందికి ఇష్టమే. దీంతో చేసిన వంటకాలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కోడిగుడ్లతో మనం అనేక వంటలను చేయవచ్చు. వీటిని నేరుగా ఉడకబెట్టి లేదా ఆమ్లెట్ వేసి ఎక్కువ మంది తింటుంటారు. అలాగే కోడిగుడ్డు ఫ్రై, కోడిగుడ్డు టమాటా, పులుసు వంటివి చేసుకుని తింటుంటారు. అయితే ఎగ్స్‌తో చేసే వంటకాల్లో ఎగ్ భుర్జీ కూడా ఒకటి. దీన్ని సాధారణంగా ధాబాల్లో చేస్తారు. వాటిల్లో ఎగ్ భుర్జీ ఎంతో రుచిగా ఉంటుంది. అయితే కాస్త శ్రమిస్తే మనం కూడా ఇంట్లోనే ఎగ్ భుర్జీని ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇక ఎగ్ భుర్జీ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ భుర్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 4 (పెద్దవి), నెయ్య లేదా నూనె – 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ – 1 (మీడియం సైజ్ ఉన్నది, సన్నగ తరగాలి), పచ్చి మిర్చి – 1 లేదా 2 (సన్నగా తరగాలి), టమాటా – 1 (మీడియం సైజ్‌ది, సన్నగా తరగాలి), క్యాప్సికం – అర కప్పు (సన్నగా తరగాలి), పసుపు – అర టీస్పూన్, కారం – అర టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, ఆవాలు – అర టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర – కొద్దిగా (గార్నిష్ కోసం, సన్నగా తరగాలి), నిమ్మరసం – కొద్దిగా.
ఎగ్ భుర్జీని తయారు చేసే విధానం..
స్టవ్ ఆన్ చేసి మీడియం మంటపై ఉంచి పాన్ పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత అందులో జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించాలి. అందులోనే తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వాటిని బాగా వేయించాలి. క్యాప్సికం ముక్కలను వేసి మరో 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించాలి. తరువాత టమాటా ముక్కలను వేసి బాగా కలిపి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
అనంతరం పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత కోడిగుడ్లను కొట్టి అందులో వేయాలి. కోడిగుడ్డును చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ బాగా ఉడికించాలి. కూరగాయ ముక్కలతో కోడిగుడ్డు ముక్కలు బాగా కలిసే వరకు వేయించాలి. తరువాత అందులో గరం మసాలా పొడి వేసి మరో నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించాలి. చివరగా కొత్తిమీర ఆకులను వేసి గార్నిష్ చేయాలి. దీనిపై అవసరం అనుకుంటే నిమ్మరసం పిండి తినవచ్చు. నిమ్మరసం పిండితే టేస్ట్ మరింత పెరుగుతుంది. వద్దు అనుకుంటే అవసరం లేదు.
ఇలా ఎగ్ భుర్జీని ధాబాల్లో తయారు చేసే విధంగా ఎంతో సులభంగా ఇంట్లోనే తయారు చేసి తినవచ్చు. దీన్ని అన్నం లేదా టోస్ట్ చేయబడిన బ్రెడ్, పరాటా, చపాతీల్లో తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పైగా చాలా త్వరా చేయవచ్చు కూడా. అందువల్ల బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌లోకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.