Puri : మనం ఉదయం పూట అల్పాహారంగా పూరీలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. పూరీలను అందరూ ఇష్టంగా తింటారు. వెజ్, నాన్ వెజ్ కూరలతో కలిపి తింటే ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. పూరీలను తయారు చేసే విధానం అందరికి తెలిసినప్పటికి చాలా మంది వీటిని మెత్తగా, పొంగేలా తయారు చేసుకోలేకపోతుంటారు. పూరీలను చక్కగా పొంగేలా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – రెండు కప్పులు, ఉప్పు – తగినంత, పంచదార – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పూరీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కొద్దిగా పంచదారను, మూడు టీ స్పూన్ల నూనెను వేయాలి. పంచదార వేయడం వల్ల పూరీలు చక్కగా పొంగుతాయి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ మెత్తగా కలపకూడదు. తరువాత పిండిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత పిండిని మరోసారి బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యే లోపు పిండి ఉండను తీసుకుని కొద్ది కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ పూరీలా వత్తుకోవాలి. పూరీ మరీ పలుచగా మరీ మందంగా ఉండకుండా చూసుకోవాలి.
నూనె కాగిన తరువాత వత్తుకున్న పూరీని నూనెలో వేసి గంటెతో నూనెలోకి వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల పూరీలు బాగా పొంగుతాయి. ఈ పూరీలను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పూరీలు చక్కగా పొంగడంతో పాటు మెత్తగా కూడా ఉంటాయి. ఈ పూరీలను పూరీ కూర, బఠాణీ మసాలా కూర, శనగల కూర వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పూరీలను తయారు చేయడానికి ఎక్కువగా నూనె అవసరమవుతుంది కనుక అప్పుడప్పుడూ మాత్రమే వీటిని తయారు చేసుకుని తినాలి.