Idli Masala Upma : ఉప్మా అంటే చాలా మందికి నచ్చదు. రవ్వతో చేసే ఉప్మా కారణంగా చాలా మంది ఉప్మాను తినేందుకు ఇష్టపడరు. కానీ అందులోనే కూరగాయలు, జీడిపప్పు, పల్లీలు వంటివి వేసి చేస్తే ఇష్టంగా తింటారు. అయితే ఉప్మాను కేవలం రవ్వతో మాత్రమే కాదు.. మిగిలిపోయిన ఇడ్లీలతోనూ చేయవచ్చు. ఇడ్లీలు మిగిలిపోయాయని బాధపడకుండా వాటితో ఉప్మాను చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ మసాలా ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీలు – 8, ఉల్లిపాయలు – 2, టమాటాలు – 2, పచ్చి మిర్చి – 4, అల్లం తరుగు – అర టీస్పూన్, కరివేపాకు రెబ్బలు – 2, కొత్తిమీర – ఒక కట్ట, కారం – ఒక టీస్పూన్, క్యారెట్ – ఒకటి, క్యాప్సికం – ఒకటి, సాంబార్ పొడి – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీస్పూన్, శనగపప్పు – ఒక టీస్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్.
ఇడ్లీ మసాలా ఉప్మాను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో ఇడ్లీలను తీసుకుని చేత్తో పొడిలా మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, శనగపప్పు వేయించుకుని కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించుకోవాలి. నిమిషం అయ్యాక క్యారెట్ తురుము, క్యాప్సికం, ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేయించి తగినంత ఉప్పు, కారం, సాంబార్ పొడి వేసి వేయించి ఇడ్లీల మిశ్రమం వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టాలి. 2 లేదా 3 నిమిషాలు అయ్యాక కొత్తిమీర వేసి దింపేయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ మసాలా ఉప్మా తయారవుతుంది. దీన్ని ఏదైనా చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు.