Idli Rava Upma : మనం ఉదయం అల్పాహారంగా తయారు చేసుకునే ఆహార పదార్థాల్లో ఉప్మా ఒకటి. దీనిని మనం బొంబాయి రవ్వతో తయారు చేస్తూ ఉంటాం. చక్కగా చేయాలే కానీ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. కేవలం బొంబాయి రవ్వతోనే కాకుండా ఇడ్లీ రవ్వతో కూడా మనం ఉప్మాను తయారు చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఇడ్లీ రవ్వతో కేవలం ఇడ్లీలనే తయారు చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో ఈ ఇడ్లీ రవ్వతో ఉప్మాను కూడా తయారు చేసేవారు. ఇడ్లీ రవ్వతో చేసే ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఇడ్లీ రవ్వతో ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ రవ్వ ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీ రవ్వ – 2 కప్పులు, నూనె – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
ఇడ్లీ రవ్వ ఉప్మా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ రవ్వను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి రవ్వను అరగంట పాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు అన్నీ పోయేలా చేత్తో పిండుతూ రవ్వను చేత్తో పిండుతూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు, శనగపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం తరుగు వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న రవ్వను, ఉప్పును వేసి కలపాలి. అంతా కలిసేలా కలిపిన తరువాత దీనిపై మూత పెట్టి రవ్వను మెత్తగా ఉడికించాలి.
రవ్వ వేసిన తరువాత తడిగా ఉన్నప్పటికి ఉడికే కొద్ది పొడి పొడిగా అవుతుంది. రవ్వ మెత్తగా ఉడికిన తరువాత మూత తీసి మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ రవ్వ ఉప్మా తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ రవ్వతో తరచూ ఇడ్లీలే కాకుండా ఈ విధంగా ఉప్మాను కూడా తయారు చేసుకుని తినవచ్చు.