సాధారణంగా మన హిందువులు ఎన్నో సాంప్రదాయాలను పాటిస్తుంటారు. ఈ విధంగా ఆచారవ్యవహారాలను నమ్మేవారికి, వాటిని పాటించే వారికి తరచూ ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. ఇటువంటి సందేహాలలో ఒక్కటి అయినది శుక్రవారం పెళ్లి జరిపించవచ్చా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి శుక్రవారం పెళ్లిళ్లు చేయవచ్చా.. చేస్తే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణ శుక్రవారం పెళ్లిళ్లు చేయకూడదు అని నియమం ఏమీ లేదు. శుక్రవారం పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయిని అత్తింటి వారు తీసుకెళ్లే ఆచారం ఉండటం వల్ల సాక్షాత్తు శుక్రవారం మన ఇంటి మహాలక్ష్మిని బయటకు పంపినట్లు అవుతుందని భావిస్తారు. అందుకోసమే శుక్రవారం చాలామంది పెళ్లిళ్లు పెట్టుకోవడానికి వెనుకడుగు వేస్తారు. కానీ జాతక రీత్యా, పేర్ల బలాల రీత్యా శుక్రవారం ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటారు.
ఈ విధంగా శుక్రవారం పెళ్లి చేసి అమ్మాయిని అత్తవారింటికి పంపించేవారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. వివాహం జరిగిన వెంటనే అమ్మాయిని అత్తింటికి తీసుకెళ్లేటప్పుడు అత్తింటివారు ఒక చిన్న బంగారు నగను వధువు ఇంటి గడప పై పెట్టి అమ్మాయిని అత్తవారింటికి తీసుకెళ్లాలి. ఈ విధంగా బంగారం రూపంలో మహాలక్ష్మి మన ఇంట అడుగుపెడితే వధువు రూపంలో మహాలక్ష్మి అత్తవారింట అడుగు పెడుతుంది. కనుక శుక్రవారం పెళ్లి అయిన వారు ఈ చిన్న పని చేయడం ద్వారా ఇద్దరి ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.