Instant Bombay Chutney : మనం ఉదయం పూట రకరకాల అల్పాహారాలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే వాటిని తినడానికి రకరకాల చట్నీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. చట్నీలతో తింటేనే అల్పాహారాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే అందరికి ఉదయం పూట చట్నీలు చేసేంత సమయం ఉండదు. ఏదో ఒక పచ్చడి, కారం పొడి వేసుకుని తినేస్తూ ఉంటారు. అలాంటి వారు అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే బొంబాయి చట్నీని తయారు చేసుకుని తినవచ్చు. శనగపిండి ఉంటే చాలు ఈ చట్నీని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. బొంబాయి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఏ అల్పాహారంతో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఇన్ స్టాంట్ గా బొంబాయి చట్నీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ బొంబాయి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – 4 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన చింతపండు – ఒక రెమ్మ, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు- ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 2.
ఇన్ స్టాంట్ బొంబాయి చట్నీ తయారీ విధానం..
ముందుగా చింతపండు రసంలో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, తాళింపు దినుసులు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న శనగపిండి మిశ్రమం వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బొంబాయి చట్నీ తయారవుతుంది. దీనిని పూరీ, దోశ వంటి అల్పాహారాలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉదయం పూట చట్నీ చేసేంత సమయం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు శనగపిండితో చట్నీని తయారు చేసుకుని కమ్మగా తినవచ్చు.