Instant Kalakand : పాలతో చేసే రుచికరమైన తీపి వంటకాల్లో కలాకంద్ కూడా ఒకటి. స్వీట్ షాపుల్లో ఇది మనకు ఎక్కువగా లభిస్తుంది. కలాకంద్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. రుచిగా ఉన్నప్పటికి ఈ కలాకంద్ ను తయారు చేయడం చాలా కష్టం. చాలా సమయంతో, చాలా శ్రమతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. అందరూ దీనిని తయారు చేయలేరు కూడా. అయితే పాలకు బదులుగా పాలపొడితో ఇన్ స్టాంట్ గా కూడా మనం కలాకంద్ ను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసే ఈ కలాకంద్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని 20 నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా రుచిగా కలాకంద్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ కలాకంద్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – పావు కప్పు, కాచి చల్లార్చిన పాలు – పావు కప్పు, మిల్క్ పౌడర్ – 2 కప్పులు, పంచదార పొడి – పావు కప్పు, తరిగిన పిస్తాపప్పు – కొద్దిగా.
ఇన్ స్టాంట్ కలాకంద్ తయారీ విధానం..
ముందుగా పావు కప్పు పాలల్లో రెండు టేబుల్ స్పూన్ల పాలు తీసుకుని అందులో నిమ్మరసం వేసి కలిపి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి, మిగిలిన పాలు, నిమ్మరసం కలిపిన పాలు పోసి వేడి చేయాలి. పాలు విరిగిన తరువాత కొద్ది కొద్దిగా మిల్క్ పౌడర్ వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా అంతా కలిసేలా కలుపుకున్న తరువాత 2 నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత పంచదార పొడి వేసి కలపాలి. దీనిని మరో 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించాలి. కలాకంద్ కళాయికి అంటుకోకుండా వేరయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని ట్రే లో లేదా నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమానంగా చేసుకోవాలి. తరువాత పైన పిస్తా పప్పులను చల్లుకుని వత్తాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచిన తరువాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కలాకంద్ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా పాలపొడితో రుచికరమైన కలాకంద్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.