Instant Mango Pickle : మామిడికాయ పచ్చడి.. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పచ్చడిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అయితే ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అలాగే శ్రమించాల్సి ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ కేవలం పది నిమిషాల్లో మనం చాలా తేలికగా మామిడికాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేయవచ్చు. ఈ పచ్చడిని ఎక్కువగా కర్రీ పాయింట్ వాళ్లు, క్యాటరింగ్ వాళ్లు తయారు చేస్తారు. ఎంతో రుచిగా ఉండే ఈ మామిడికాయ పచ్చడిని ఇన్ స్టాంట్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ మామిడికాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మామిడికాయలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), మెంతులు – అర టీ స్పూన్, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – అర కప్పు కంటే కొద్దిగా తక్కువ, కారం – ముప్పావు కప్పు, పల్లీ నూనె – ఒక కప్పు, ఎండుమిర్చి -2, కరివేపాకు – రెండు రెమ్మలు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – ఒక టేబుల్ స్పూన్.
ఇన్ స్టాంట్ మామిడికాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా మామిడికాయలను శుభ్రంగా తుడుచుకోవాలి. వీటిని తడి లేకుండా తుడుచుకున్న తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి.చివరగా వెల్లుల్లి రెబ్బలు వేసి మరో 3 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మరో కళాయిలో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఈ దినుసులు చల్లారిన తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిగా చేయాలి.
ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో ఉప్పు, కారం, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. తరువాత నూనె వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి 3 వారాల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు.ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.