Instant Mysore Pak : మనలో చాలా మంది ఇష్టంగా తినే తీపి పదార్థాల్లో మైసూర్ పాక్ ఒకటి. దీని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ మైసూర్ పాక్ రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అలాగే దీనిని గుల్లగుల్లగా తయారు చేయడం అందరికి రాదు. కానీ ఈ మైసూర్ పాక్ ను అదే రుచితో చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో మనం తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా చేసే ఈ మైసూర్ పాక్ చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టపడేలా ఈ ఇన్ స్టాంట్ మైసూర్ పాక్ ను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ మైసూర్ పాక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి -100 గ్రా., పంచదార – 100 గ్రా., నెయ్యి -100 గ్రా..
ఇన్ స్టాంట్ మైసూర్ పాక్ తయారీ విధానం..
ముందుగా శనగపిండిని జల్లించి పక్కకు పెట్టుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో పంచదార, అర టీ గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. ఈ పంచదారను తీగ పాకం వచ్చే వరకు వేడి చేయాలి. పంచదార తీగపాకం వచ్చిన తరువాత జల్లెడ పట్టుకున్న శనగపిండిని వేసి కొద్ది కొద్దిగా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత 50 గ్రాముల నెయ్యిని వేసి కలుపుకోవాలి. దీనిని మధ్యస్థ మంటపై కలుపుతూ ఉడికించాలి. శనగపిండి మిశ్రమం నెయ్యిని పీల్చుకున్న తరువాత మిగిలిన నెయ్యిని వేసి కలుపుతూ ఉడికించాలి. ఈ శనగపిండి మిశ్రమం కళాయికి అంటుకోకుండా వేరవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన గిన్నెలోకి తీసుకోవాలి.
ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ మైసూర్ పాక్ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా చాలా తక్కువ సమయంలో అయ్యే ఈ ఇన్ స్టాంట్ మైసూర్ పాక్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా ఇన్ స్టాంట్ మైసూర్ పాక్ ను తయారు చేసి ఇవ్వవచ్చు.