Instant Rava Dosa : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో దోశ కూడా ఒకటి. దోశను ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. దీనిని చాలా మంది ఇంట్లోనే తయారు చేసుకుంటారు. కానీ దోశ పిండిని తయారు చేయడం కొద్దిగా సమయంతో, శ్రమతో కూడిన పని. దోశ పిండిని మనం ముందు రోజే తయారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలా మందికి ఈ పిండిని తయారు చేసుకుని పెట్టుకునేంత సమయం ఉండడం లేదు. కనుక దోశలను తినాలనుకునే వారు అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా రవ్వతో దోశను తయారు చేసుకుని తినవచ్చు. రవ్వతో చేసే ఈ దోశ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇన్ స్టాంట్ గా రవ్వతో దోశను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ రవ్వ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
రవ్వ – ఒక కప్పు, బియ్యం పిండి – ఒక కప్పు, మైదా పిండి – పావు కప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – కొద్దిగా, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, పెరుగు – పావు కప్పు, నీళ్లు – తగినన్ని, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – అర కప్పు.
ఇన్ స్టాంట్ రవ్వ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు, పెరుగు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత పెరుగును వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లను పోస్తూ దోశ పిండి కంటే పలుచగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి ఈ పెనం బాగా వేడైన తరువాత తగిన మోతాదులో పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి. ఈ దోశ మీద తగినంత నూనె వేసి రెండు దిక్కులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ దోశ తయారవుతుంది. ఈ రవ్వ దోశ తయారీలో ఉల్లిపాయలను, క్యారెట్ తురుమును, పచ్చి మిర్చిని, కొత్తిమీరను దోశ వేసిన తరువాత దోశపై చల్లుకుని ఆ తరువాత దోశను కాల్చుకోవచ్చు. ఈ విధంగా రుచికి తగినట్టు రవ్వ దోశను తయారు చేసుకోవచ్చు. ఈ దోశను పల్లీ చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.