మనం అల్పాహారంగా రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన దోశలల్లో టమాట దోశ కూడా ఒకటి. టమాటాలతో చేసే ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. సమయం తక్కువగా ఉన్నప్పుడు, టిఫిన్ ఏం చేయాలో తోచనప్పుడు ఈ టమాట దోశను తయారు చేసుకుని తినవచ్చు. అలాగే ఎవరైనా ఈ దోశను చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ టమాట దోశను ఇన్ స్టాంట్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ టమాట దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 3, ఎండుమిర్చి – 4, అల్లం – అర చెక్క ముక్క, బొంబాయి రవ్వ – ఒక కప్పు, గోధుమపిండి – పావు కప్పు, నీళ్లు – అర కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – అర టీ స్పూన్.
ఇన్ స్టాంట్ టమాట దోశ తయారీ విధానం..
ముందుగా జార్ లో టమాట ముక్కలు, ఎండుమిర్చి, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత రవ్వ, గోధుమపిండి, నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మరో అర కప్పు నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఈ పిండిలో ఉప్పు, వంటసోడా తగినన్ని నీళ్లు పోసి మరోసారి కలపాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి టిష్యూతో తుడవాలి. తరువాత పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. దీనిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఇన్ స్టాంట్ టమాట దోశ తయారవుతుంది. దీనిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన టమాట దోశను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.