Jaggery Appalu : సాధారణంగా మనం పండుగలు, ఇతర శుభ కార్యాల సమయంలో పలు రకాల పిండి వంటకాలను చేసుకుని తింటుంటాము. అయితే కొన్ని రకాల పిండి వంటలను ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు మారాం చేసినా లేదంటే సాయంత్రం సమయంలో చిరు తిండి కోసమైనా ఎవరైనా తినేందుకు పలు రకాల పిండి వంటలను చేస్తుంటాము. ఈ క్రమంలోనే అలాంటి పిండి వంటల్లో బెల్లం అప్పాలు కూడా ఒకటి. వీటిని సరిగ్గా చేయాలే కానీ ఎంతో రుచిగా ఉంటాయ. ఎవరైనా సరే సులభంగా చేయవచ్చు. ఇక వీటిని ఎలా తయారు చేయాలో వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం అప్పాల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – 1 కప్పు (2 గంటల పాటు నానబెట్టుకోవాలి), బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పు, యాలకులు – 2, అరటి పండు – 1, నూనె – వేయించేందుకు సరిపడా, కొబ్బరి తురుము – 1 టేబుల్ స్పూన్, బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్.
బెల్లం అప్పాలను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో బెల్లం తరుగు, పావు కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. బెల్లం కరిగి పాకంలా మారుతున్నప్పుడు దింపేయాలి. నానబెట్టుకున్న బియ్యం, బియ్యం పిండి, అరటి పండు, కొబ్బరి తురుము, యాలకులను మిక్సీలో వేసుకుని పావు కప్పు నీళ్లు పోసి మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. అనంతరం దాన్ని బెల్లం పాకంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని గరిటెతో తీసుకుంటూ కాగుతున్న నూనెలో వేస్తూ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. దీంతో వేడి వేడి రుచికరమైన బెల్లం అప్పాలు రెడీ అవుతాయి. ఇవి 2, 3 రోజుల పాటు నిల్వ ఉంటాయి కనుక వాటిని ఆలోపు తినేయాలి. సాయంత్రం సమయంలో తినేందుకు ఇవి ఎంతో చక్కగా పనికొస్తాయి. అందరికీ నచ్చుతాయి.