Jonna Appalu : మనం జొన్న పిండితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. జొన్న పిండితో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. జొన్నపిండితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో జొన్న చెక్కలు కూడా ఒకటి. వీటిని జొన్న అప్పాలు అని కూడా అంటారు. ఈ చెక్కలు తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ చెక్కలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ జొన్న చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న అప్పాల తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న పిండి -పావు కిలో, బెల్లం తురుము – 100 గ్రా., ఎండు కొబ్బరి – 50 గ్రా., యాలకులు – 4, ఉప్పు -2 టీ స్పూన్స్, నెయ్యి -ఒక టేబుల్ స్పూన్.
జొన్న అప్పాల తయారీ విధానం..
ముందుగా జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు, యాలకులు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత గిన్నెలో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసివేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో జొన్నపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఎండ కొబ్బరి మిశ్రమం, ఉప్పు, నెయ్యి వేసి కలపాలి. తరువాత బెల్లం మిశ్రమాన్ని వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి అరగంట పాటు ఉంచాలి. ఇప్పుడు పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
ఇప్పుడు పూరీ ప్రెస్ ను తీసుకుని దానిపై మందంగా ఉండే కవర్ ఉంచాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ కవర్ పై ఉంచి చెక్క అప్పలాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న చెక్కలు తయారవుతాయి. ఈ చెక్కలు 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. జొన్న పిండితో తరచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా చెక్కలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.