Jonna Paratha : మనం జొన్న పిండితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. జొన్న పిండితో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. జొన్నపిండితో మనం ఎక్కువగా రోటీ, దోశ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా జొన్న పిండితో మనం ఎంతో రుచిగా ఉండే పరాటాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. జొన్న పిండితో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా పరాటాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న పరాటాల తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న పిండి – ఒక కప్పు, గోధుమపిండి – పావు కప్పు, తరిగిన మెంతి ఆకు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నువ్వులు – 3 టీ స్పూన్స్, పెరుగు – ముప్పావు కప్పు, నూనె – 2 టీ స్పూన్స్.
జొన్న పరాటా తయారీ విధానం..
ముందుగా ఒక జల్లెడలో జొన్న పిండి, గోధుమపిండి వేసి జల్లించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పెరుగు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత అర కప్పు పెరుగు, నూనె వేసి కలపాలి. అవసరమైతే మరి కొద్దిగా పెరుగు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా పిండిని తీసుకుని ఉండలా చేసుకోవాలి. దీనిని పొడి జొన్న పిండి చల్లుకుంటూ మందంగా ఉండే పరాటాలా వత్తుకోవాలి. అవసరమైతే దీనిపై కొద్దిగా నువ్వులను వేసి కూడా వత్తుకోవచ్చు. ఇలా వత్తుకున్న తరువాత ఈ పరాటాను పెనం మీద వేసి కాల్చుకోవాలి.
ముందుగా రెండు వైపులా సగానికి పైగా కాల్చుకున్న తరువాత నెయ్యి లేదా నూనె వేస్తూ కాల్చుకోవాలి. పరాటాను రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న పరాటాలు తయారవుతాయి. వీటిని ఊరగాయ లేదా పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా లేదా లంచ్ బాక్స్ లోకి ఇలా జొన్న పరాటాలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.