Kalagura Chutney : మనం అల్పాహారాలను తినడానికి రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాము. చట్నీలు రుచిగా ఉంటేనే మనం అల్పాహారాలను తినగలుగుతాము. తరచూ చేసే చట్నీలతో పాటు అప్పుడప్పుడూ కింద చెప్పిన విధంగా చేసే కలగూర చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారాలతో తినడానికి ఈ చట్నీ చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ కలగూర చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కలగూర చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, కందిపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 5, కరివేపాకు -ఒక రెమ్మ, పచ్చిమిర్చి – 8, కొత్తిమీర – గుప్పెడు, పుదీనా – గుప్పెడు, తరిగిన ఉల్లిపాయ – 1,వెల్లుల్లి రెబ్బలు – 8,అల్లం – ఒక ఇంచు ముక్క, తరిగిన పెద్ద టమాట – 1, చింతపండు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, బెల్లం – ఒక చిన్న ముక్క, పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు.

కలగూర చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మినపప్పు, శనగపప్పు, కందిపప్పు వేసి వేయించాలి. ఇవి సగం వేగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత కొత్తిమీర, పుదీనా కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదేకళాయిలో మరో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత టమాట ముక్కలు, చింతపండు వేసి కలపాలి.
తరువాత వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు జార్ లో ముందుగా వేయించిన దినుసులను వేసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కొబ్బరి తురుము, బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన టమాటాలు, ఉల్లిపాయలు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ చట్నీని గిన్నెలోకి తీసుకుని తాళింపు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కలగూర చట్నీ తయారవుతుంది. దీనిని ఇడ్లీ, దోశ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.